🇮🇳 పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య ( గాన గంధర్వ కళాతపస్వి
🇮🇳 పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య ( గాన గంధర్వ కళాతపస్వి
Admin
Author
🇮🇳 గాన గంధర్వ, కళాతపస్వి పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య
పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య (కల్యాణం వెంకట సుబ్బయ్య) ప్రముఖ భారతీయ రంగస్థల, చలనచిత్ర నటులు మరియు మధుర గాయకులు.
జననం: మార్చి 5, 1901 (సుద్దపల్లి గ్రామం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్)
మరణం: ఫిబ్రవరి 24, 1975
ప్రసిద్ధికారణం: నోటితో ఈల వేస్తూ (విజిల్) పద్యాలు, పాటలు పాడడంలో ఈయనే మొదటివారు. అందుకే ఆయనను "ఈలపాట రఘురామయ్య" అని పిలిచేవారు.
బిరుదులు/గౌరవాలు:భారత ప్రభుత్వం చే పద్మశ్రీ పురస్కారం.రవీంద్రనాథ్ టాగూర్ చే "నైటింగేల్ ఆఫ్ ది స్టేజ్" (Nightingale of the Stage) ప్రశంస.సంగీత నాటక అకాడమీ అవార్డు.
నటన: సుమారు 60 ఏళ్ల పాటు రంగస్థలంపై శ్రీకృష్ణుడు, నారదుడు, దుష్యంతుడు వంటి పాత్రలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. 20 వేలకు పైగా నాటక ప్రదర్శనలు మరియు 100కి పైగా సినిమాలలో నటించారు.
కళాతపస్వి, తేజస్వి, సరస్వతీ మానస పుత్రుడుగా కళారాధకుల మనస్సులలో చెరగని ముద్ర వేసుకున్న సామాన్య జనా, మనో రంజకుడై తన జీవితాన్ని కళారంగానికి అర్పించిన మహా మనిషి బలిజకాపుల ఇంట జన్మించి తెలగకులానికే వన్నె తెచ్చిన అపర గాన గంధర్వుడు పద్మశ్రీ కళ్యాణం రఘురామయ్య నాయుడు గారు.
కళ అజరామరము, కళ లోకకళ్యాణకరం, కుల మతాలకు అతీతం. సర్వుల చేత సర్వకాలములలో ప్రేమించబడువాడు. గౌరవింపబడేవాడు. కళాకారుడు మాత్రమే.
కళాకారుడు జాతీయ సమైక్యతా దోహదకారుడు, అరవై నాలుగు కళలలో ఉత్తమత్వాన్ని సంతరించుకున్నవి మన లలితకళలు. అందులో ఉత్తమ కళాప్రక్రియ, సంగీతం, ఆ సంగీతము తెలుగునాట నాటకరంగంలలో ప్రయోగింపబడి పద్యపఠనా విదానానికి ప్రత్యేక ఆకర్షణ అయ్యింది; సంగీతం, గాత్రం ద్వారా సంగీత పరికరం ద్వారా ప్రయోగించుట సహజం. కాని ఏ పరికరము లేకుండా వేలు మడత బెట్టి, నోటి ద్వారా ప్లూటునాదాన్ని ధ్వనింపచేసిన నాద (సంగీత) సృష్టికర్త పద్మశ్రీ ఈలపాట (కళ్యాణం) రఘురామయ్య గారు ధన్యజీవి ఆదర్శప్రాయుడు. అటువంటి మహావ్యక్తులు, తెలుగుజాతికి మన తెలగజాతికి గర్వకారణం.
గుంటూరుజిల్లా సుద్దపల్లి గ్రామం (చేబ్రోలు మండలం) లో కళ్యాణం నరసింహారావు శ్రీమతి వెంకట సుబ్బమ్మ దంపతులకు ఎనిమిది మంది సంతానం అందులో ఐదవ సంతానంగా 1900 సం॥ రఘురామయ్య గారు జన్మించారు (అసలు పేరు - వెంకట సుబ్బయ్య) బాల్యములో విద్యాభ్యాసమునకు సరిగా వెళ్ళకుండా చెట్లు పుట్టలవెంట తిరుగుతూ ఆ గ్రామంలో అపుడపుడు మహా సంగీత విద్వాంసుల సంగీత కచేరీలకు వెళుతూ సంగీతం మీద మనస్సు లగ్నం చేసి నాదస్వరము నుండి (పిల్లనగ్రోవి) ఈ నాదమెలా వస్తుంది అనే ఆలోచన కలిగి పెద్దవాడైన తర్వాత పాడినపాట, సంగీతము ఏ సాధన లేకుండా అలవోకగా పాడుచుండెడివాడు. ఏ అభ్యాసము లేనటువంటి వ్యక్తి సంగీత సాంప్రదాయాలు తెలియకపోయినా అనర్గళంగా పాడి, వినేవారిని పరవశులను చేశాడు.
ఒకనాడు ఆ గ్రామపెద్ద మనిషి సంగీత రసికత కలిగిన వ్యక్తి. దంటు కృష్ణయ్య గారు ఈ కుర్రవాని పాట విని ఆశ్చర్యపడినాడు. అప్పటికే తెనాలిలో మహానటుడు యడవల్లి సూర్యనారాయణరావుగారు ప్రాక్టీసు చేస్తున్న “భక్త రామదాసు” నాటకములో రఘురాముని పాత్రకు బాలనటుడు (బాలగాయకుడు) కావాలి అని తన మిత్రుడైన దంటు కృష్ణయ్యతో చెప్పాడు. అంతకు పూర్వమే సుద్దపల్లి గ్రామంలో సుమధురంగా పాడుతున్న 8 సం|| వెంకట సుబ్బయ్య అనే బాలుని తీసుకెళ్ళి సూర్యనారాయణ గారికి పరిచయం చేశాడు. బాలుని అందచందాలు గాత్ర మాధుర్యం, సూర్యనారాయణ మెచ్చుకొని అతనికి మంచి శిక్షణ యిచ్చి అతని చేత తెనాలిలో ప్రప్రథమంగా రామదాసు నాటకంలో రఘురాముడి పాత్ర ధరింపచేశాడు. అందులో ఆ బాలుడు పాడిన పాటకు ప్రేక్షకులు కరతాళ ధ్వనులు “వన్స్‌మోర్" కొడుతూ మళ్ళీ పాడాలని ప్రేక్షకులు పెట్టిన కేకలకు బాలుడు స్టేజీ మీద నుండి పారిపోయాడు. మరలా బలవంతంగా పట్టుకొచ్చి ఆ కుర్రాడికి ధైర్యం చెప్పి పాడించి, ఆడించి ప్రేక్షకులను ఆనంద పరవశులను చేశాడు.
1916 మద్రాసు పి.వి. హాలులో అదే నాటకం ప్రదర్శిస్తున్న సందర్భములో నాటకం కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు చూడడం తటస్థించింది. నాటకం చూసి ఆనందించడమే గాక రఘురాముని పాత్రలో ఉన్న వెంకట సుబ్బయ్యను రఘురామా! అని పిలిచి దగ్గరకు తీసుకొని స్టేజీ మీద ప్రశంసల వర్షం కురిపించి ఇకనుండి నీపేరు రఘురాముడే అని అనడంతో ఆనాటి నుండి వెంకట సుబ్బయ్యగా పిలవబడుతున్న వ్యక్తి రఘు రామయ్యగా పిలువబడ్డాడు. ఆ రఘురామయ్య నాటకసాధనతో బాటు "ఈలపాట”ను కూడా సాధన చేసి ఈలపాట రఘురామయ్యగా ప్రసిద్ధి గాంచాడు. అప్పటికే మహా గాయకుడిగా పేరుబడ్డ జొన్నవిత్తుల శేషగిరిరావు గారితో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సంగీత మెళకువలు నేర్చుకున్నాడు. కాస్త పెద్దవాడయిన తర్వాత విజయవాడలో యడ్లవల్లి సూర్యనారాయణ, శకుంతల నాటకంలో ఉప్పులూరి సంజీవరావుచేత శకుంతల పాత్ర, రఘురామయ్య చేత అనుసూయ పాత్ర వేయించాడు. మరలా మదనపల్లెలో “శకుంతల” పాత్ర వేయించాడు. ఆ పాత్రను చూసి బళ్ళారి రాఘవగారు మురసిపోయారు. యడవల్లి వారి పృథ్వీరాజ్ నాటకంలో "సంయుక్త" పాత్ర వేశారు. శ్రీకృష్ణ తులభారంలో రుక్మిణిగా రామదాసు నాటకంలో కమలగా ధరణికోట నాటకంలో రాణిగా స్త్రీ పాత్రలు ధరించారు. 1933 సం॥లో సరస్వతీ సినిటోన్ పతాకంపై పోతిన శ్రీనివాసరావు బొంబాయిలో నిర్మించిన “పృథ్వీపుత్ర” చిత్రంలో తొలిసారిగా సినిమాలో నటించారు. తర్వాత "పృధ్వీపతి, నరకాసుర, కచ దేవయాని, పాశుపతాస్త్రం, కృష్ణ కుచేల నాటకాలలో బాగా రాణించాడు. కృష్ణకుచేల నాటకంలో శ్రీకృష్ణుని పాత్ర వేశారు. 1935 సం॥లో "కుచేల" చిత్రంలో తొలిసారిగా శ్రీకృష్ణుని పాత్రలో నటించారు. దాదాపు ఇరవై వేల నాటకాలలో ప్రదర్శించారు.
నటి యర్రంశెట్టి కృష్ణవేణిగారు నిర్మించిన శోభనాచల స్టూడియోస్ వారి సంస్థలో ఎక్కువ చిత్రాలలో నాయకుడి పాత్రలలో నటించారు. ఆనాటి నాటక రంగస్థలనటి "ఆదోని లక్ష్మి" గారిని వివాహమాడారు. ఇటు నాటకాలలోనూ. అటు సినిమాలలోనూ నటిస్తూ వచ్చారు. యోగా, కసరత్తు, ఎక్సర్సైజులు చేసేడివారు. ఇక సినిమాల విషయానికొస్తే "కచ దేవయాని" మాలపిల్ల (1938) ఉషా పరిణయం (1939) దక్షయజ్ఞం, తల్లిప్రేమ. అపవాదు (1941), భక్త తులసీదాస్ (1946), గొల్లభామ, రాధిక బ్రహ్మరథం (1947), మదాలస శ్రీకృష్ణదేవరాయలు వ్రాసినది (1948), పల్లెటూరి పిల్లలో కొంతవరకు నటించి ఫైటింగ్ తన వల్ల కాదని మానుకున్నాడు. ప్రపంచం (1953) సతీ సక్కుబాయి (1954), శ్రీకృష్ణ తులాభారం (1955), భక్త అంబరీష (1959), దేవాంతకుడు (1960), సత్య హరిశ్చంద్ర, శ్రీ రామాంజనేయ యుద్ధం (1975), దాదాపు 100 సినిమాలకు పైగా నటించారు.
ఎన్.టి.రామారావు గారు 15 రోజులు శ్రీకృష్ణపాత్ర మెళుకువలు, రఘురామయ్య వద్ద నేర్చుకున్నారు. దేశవిదేశాలలో పెక్కు నాటక ప్రదర్శనలిచ్చారు. తెలుగు సినిమాలో తొలి శ్రీకృష్ణుడి పాత్రలో నటించిన ఘనత రఘురామయ్య గారిదే!
గొల్లభామ సినిమాలో రఘురామయ్య గారు పాడిన "వలపు తేనియలూరిన” అనే పద్యం ఆ రోజులలో సినిమా సక్సెస్‌కు దోహదపడింది. ప్రతి రంగస్థలం మీద ఆ పద్యం పాడించారు ప్రేక్షకులు. తల్లి ప్రేమ సినిమాలో ఒక శ్లోకమునకు సినిమా తెరమీద ఒన్స్ మోర్ కొట్టి సినిమాను మరలా వెనక్కు తిప్పి, మరలా ఆ శ్లోకం వేయించిన రోజులు గుర్తు చేసుకుంటే, ఆ మహానటుడి గానంలో ఎంత మధురమైన తియ్యదనముందో ఆయన నాటకాలు చూసిన ప్రేక్షకుడు ఆయనతో నటించిన నటులు ఎంతో ఆనందపడ్డారు. ఆనాటి సినిమాలలో రాయబారం, తులాభారం, సినిమాలలో శ్రీకృష్ణుని పాత్రలు అన్నీ రఘురామయ్య గారు చేసినవే! స్వప్న, వాసవదత్త, రత్నావళి నాటకాలలో మంచి పేరొచ్చింది. శకుంతల నాటకం కలకత్తాలో ప్రదర్శించగా అది చూసిన రవీంద్రనాథ ఠాగూర్ గారు 1928 సం||లో రఘురామయ్యను సన్మానించి “నైటింగేల్ ఆఫ్ ది స్టేజి" బిరుదుతో సత్కరించారు. ఆ విషయం ఆక్స్ఫర్డ్ కంపెనీవారు ప్రచురించిన "ఠాగూర్ రీ కలక్షన్స్” అనే బుక్ ప్రస్తావించబడింది. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ సమక్షములో చూపుడువేలు మడతబెట్టి దానిని నాలుక వద్దకు చేర్చి ఈలపాట పాడిన ఏకైక నటుడు. ఆయనను ఇందిరాగాంధీ గారు సన్మానించారు.
1938 సం||లో బాపట్లలో రోహిణి వెంకటసుబ్బయ్య, శ్రీమతి సీతమ్మగార్ల సంతానం సావిత్రమ్మను వివాహం చేసుకుని ఆనందమయ జీవితం గడిపి, ఒక కుమార్తె - రామకృష్ణ అను కుమారుడు కలరు. స్థానం నరసింహారావుగారి శ్రీకృష్ణతులాభారంలో శ్రీకృష్ణుడుగా, సారంగధరలో సారంగధరుడిగా, చింతామణిలో భవాని శంకరుడుగా ఇత్యాది పాత్రలు ఆంధ్రదేశమేగాక ఆంధ్రోతర రాష్ట్రాలలో తెలుగు నాటక రంగ వైభవం బాటలు వేయడానికి దోహదపడింది.
1954 అనంతశయనం అయ్యంగార్ లోకసభ స్పీకరుగారి చేత ప్రశంసాపత్రం అందుకున్నారు. జర్మనీ దేశంలో పర్యటించి తెలుగు జాతిపద్యం “ఈలపాట” ఖండాంతర వ్యాప్తికి దోహదపడింది.
1973లో మహారాష్ట్ర పూనానగరంలో బాల గంధర్వ వర్థంతి సభకు అధ్యక్షత వహించిన ఘనత రఘురామయ్యగారికే దక్కింది. ఆనాటి సభలో హీరాబాయి బారాట్కార్, వసంతరావు దేశపాండే, భీంసేస్ జోషి, మొదలగు హిందూస్థానీ సంగీత విద్వాంసులముందు “మూర్తిమంతమాయే” కీర్తనపాడి ఉత్తర హిందూస్థాన్ పండిత, ప్రేక్షకుల ప్రశంసలందుకున్న ఘనత ఆయనదే. 1974లో ఐదు నిముషాలు ఇంటర్వ్యూ ఇచ్చిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 40 ని॥ ఆయన గానామృతాన్ని "ఈలపాట”ను వింటూ ఆనందపరవశు రాలయింది. ప్రపంచములో అరుదైన ప్రక్రియ “ఈలపాట" అని ఆమె ప్రశంసించింది.
1975 సం||లో ఆయనకు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. అది ఆయన విన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఆ అవార్డు స్వయంగా తీసుకోకుండానే 24-2-1975న దివంగుతలైనారు. భారత ప్రభుత్వం ఆ అవార్డు మార్చి నెలలో ఇంటికి పంపి గౌరవించింది. సుమారు 60 సం॥రాలు తెలుగునాటక రంగాన్ని ప్రభావితం చేసి వందకు పైగా సినిమాలలో ప్రధానపాత్రలు పోషించి అద్భుత గానామృతంతో శ్రీకృష్ణపాత్రలో ఆనాడు ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించి మురళీ లేకుండా, మురళీరవాన్ని వినిపించిన మహానుభావుడు కళ్యాణం రఘురామయ్య. ఆయన కాంస్యవిగ్రహం సుద్దపల్లి గ్రామంలో ఆయన కుమారులు రామకృష్ణ మరియు కళాకారులు ఏర్పాటు చేశారు. నేడు రఘురామయ్యగారు మన మధ్యన లేకపోయినా గ్రాంఫోన్ రికార్డులలో తన గాత్రానికి శాశ్వితం కల్పించారు. శ్రీరామాంజనేయ యుద్ధ బాపు దర్శకత్వం 'నీల మేఘశ్యామా! కోదండరామా' గీతం పంచామృతం.
భట్టరుశెట్టి పద్మారావు రాయులు
No comments yet. Be the first to comment!